మన దేశంలో దిగజారుతున్న విద్యావ్యవ్యస్థ

ఒకప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యున్నత విద్యను అందించే నలందా విశ్వవిద్యాలయానికి పుట్టిళ్ళు మన దేశం, గురుకులాల పేరిట విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యని, వినయాన్ని మరియు ఇతరుల పట్ల గౌరవంతో మెలిగే విలువలకు పట్టుకొమ్మ మన దేశం. ఎందరో మేటి గురువులు, విద్యావంతులు ఉన్న అప్పటి భారతానికి నేటి భారతానికి తేడా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. కారణమేంటి?

ఒకప్పుడు విద్య అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లా విద్యా, వినయం రెండూ నేర్పి తరువాత సమాజంలో వ్యావహారికంగా ఎలా మెలగాలో నేర్పే అంశంగా ఉండేది. లోకజ్ఞానం మరియు వివిధ అంశాల మీద పట్టు సాధించే దిశగా బోధనా పద్ధతులు ఉండటం వల్ల, విద్యాలయం నుండి బయటకు వచ్చిన విద్యార్ధి విద్యావినయ విషయాల్లో మంచి పరిజ్ఞానం కలవాడిగా ఉండేవాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న విద్యార్ధి బయటకు వచ్చి తనకు నచ్చిన, వచ్చిన మార్గంలో ప్రయాణించే అవకాశాలతో జీవనవిధానం మెరుగు పెట్టుకునే దిశగా సాగిపోయేవాడు.

తరువాతి కాలంలో వినయం అన్నది కుటుంబ పరమైన అంశం గా మార్చివేసి కేవలం విద్య కోసం మాత్రమే విద్యాలయాలను ఆశ్రయించడం జరిగింది, ఆ తరువాత జరిగిన అనేక మార్పుల దృష్ట్యా ప్రభుత్వాల తరపున ఉన్న విద్యాలయాలు, ప్రభుత్వేతర విద్యాలయాలు ఏర్పడ్డాయి.. ఇక్కడి నుండే మన విద్యావ్యవస్థ కుంటుపడటానికి బీజం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు.

ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాల చేతిలోని విద్యాలయాలు దాదాపు 90 వ దశకం వరకు మంచి పరిణతితోనే నడిచాయి. పాఠశాలల ఏర్పాట్లు, వాటి నిర్వహణా బాధ్యతలు మరియు విద్యాబోధన పద్ధతులు మెకాలే గారి పద్దతిలోనే సాగినా కానీ కనీసం ప్రతి విద్యార్ధి ఆస్తుల తారతమ్యం లేకుండా అక్కడే చదువుకునే ఏర్పాటు ఉండటం తో బోధన అన్నది కేవలం ఒక పని అన్న విధంగా కాకుండా జ్ఞానవిస్తరణగా జరిగింది. పిల్లల విద్యావిషయాల్లో కానీ ఆటపాటల విషయాల్లో కానీ ఎక్కువ వత్తిడి లేకుండా ప్రశాంతంగా చదువు సాగించిన ఘనత అప్పటి తరానిది, దాదాపు అప్పటి తరం వారికి ఇంకా ఆ
విషయాలు గుర్తుకు ఉండే ఉంటుంది. ఎంతసేపు చదివామన్నది కాకుండా చదువు, వ్యాయామం మరియి ఆటలు అన్నీ సమపాళ్ళలో ఉన్న విద్యావ్యవస్థ అది.

రాను రాను ఉద్యోగ ప్రైవేటీకరణ, ఆసుపత్రుల ప్రైవేటీకరణ పుణ్యమా అని విద్య కూడా ప్రైవేటీకరణ జరిగింది, అక్కడి నుండి మన విద్యావ్యవస్థ ఇంకా దిగజారిపోయింది. మార్క్స్ మాత్రమే కొలమానాలుగా ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారు. విద్యార్ధి మానసికంగా ఎలా ఉంటున్నాడు, శారీరకంగా ఎదుగుతున్నాడా లేదా అన్నది పక్కన పెట్టి కేవలం ఆ విద్యార్ధి మార్కులు మాత్రమే అతని చదువు కు కొలమానంగా తీసుకోవడం మొదలయ్యింది.

అసలే మెకాలే రాయించిన చరిత్రనే నేటి చదువులుగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఆ చరిత్ర కు, విద్యావిధానానికి కేవలం వచ్చిన మార్కులు, గ్రేడ్ లు మాత్రమే కొలమానంగా పెట్టడం తో, విద్యావ్యవస్థనే కాకుండా చదువు కూడా కేవలం పుస్తకాలను బట్టీ పట్టించడంతోనే సరిపోయింది. దీనికి తోడు పోటీ పరీక్షల శిక్షణ పేరిట పిల్లల మనసుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం లో సఫలీకృతులు అయ్యారు నేటి మేధావులు. ఒకప్పుడు ఇంటర్ చదివిన తరువాత ఇంజనీరింగ్ కోసమో లేక మెడిసిన్ కోసమో శిక్షణ ఇచ్చే అలవాటు ఉండేది, అప్పటికీ ఆ విద్యార్ధి మెదడు ఆ క్లిష్ట సమస్యలను ఎదుర్కోవడానికి అనుగుణంగా ఉండేది కాబట్టి పెద్దగా శ్రమ పడాల్సిన అవకాశం ఉండేది కాదు.

కానీ నేడు విద్యార్ధి 4 వ తరగతి నుండే ఇంజనీరింగ్ కి సన్నద్ధం చెయ్యడానికి, 5 దాటగానే ఐఐటీ, జేఈఈ పేరిట వారి మనస్సు ఎదగకుండానే వారి చిన్ని మెదళ్లలో క్లిష్టతరమైన సమస్యలను పరిష్కరించే విధంగా బలవంతంగా రుద్దడం జరుగుతుంది, దీని వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి కి లోనయ్యే పిల్లల మనస్తత్వాలు వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయి అన్నది అర్థం చేసుకోవడం లేదు నిర్వాహకులు. ఇలాంటి విద్యాలయాల్లో పిల్లలను చేర్పించడానికి తల్లితండ్రులు చూపుతున్న ఉత్సాహంలో కనీసం 10 వ వంతు తమ పిల్లల మనసులను, వారి అమూల్యమైన బాల్యాన్ని అర్థం చేసుకోగలిగితే నేటి సమాజంలో విద్యార్థుల చావులు అంతగా ఉండేవి కావేమో.

చదువు విజ్ఞానం అందించాలి కానీ మానసిక, శారీరక రోగులను తయారు చెయ్యకూడదు.. ఇప్పుడున్న చదువుల్లో అయితే మానసికంగా తీవ్రమైన ఒత్తిడి కి గురి చేస్తున్నారు పిల్లలను, వారిని స్కూల్ లో దింపే టైం దగ్గరనుండి చూస్తే వారు దాదాపు రాత్రి నిద్రకు ఉపక్రమించేంతవరకు వినపడేది హోమ్ వర్క్ మాత్రమే, స్కూల్ లో చదివించి, ట్యూషన్ కు పంపి, మళ్ళీ ఇంటికి రాగానే హోమ్ వర్క్ అంటూ వారి బాల్యాన్ని లాగేస్తున్న తల్లితండ్రుల తప్పు ఎంత ఉందొ, దాని వాణిజ్యపరమైన అంశంగా తీసుకుంటున్న విద్యాలయాల నిర్వాహకులది కూడా అంతే తప్పు ఉంది.

ఇదే స్కూల్ టైమింగ్స్ విషయంలో పోయిన ఏడాది ఒక చిన్న పాప ఫోటో ను ట్విట్టర్ లో షేర్ చెయ్యడం ద్వారా మంత్రి కేటీఆర్ గారు స్పందించారు, కానీ ఆ స్పందన కేవలం ట్విట్టర్ వరకు మాత్రమే పరిమితమైనట్లుంది. ఆ తరువాత ఆ విషయం గురించి ఎవ్వరు ఎక్కడా ప్రస్తావించిన, చూసిన సందర్భం అయితే కనపడలేదు. చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ స్పందన కార్యరూపం దాల్చి పిల్లల పాలిట మంచి విషయం అయ్యేది

అసలు విద్యాబోధన లో అన్ని దేశాల కంటే ముందు ఉన్న ఫిన్లాండ్ విద్యావ్యవస్థ లో పిల్లల చదువులకు వారికి కేటాయించే సమయం కేవలం 5 గంటలు, ఇది కూడా పెద్ద తరగతుల వారికి, చిన్న తరగతులవారికి మూడు నుండి నాలుగు గంటల సమయం మాత్రమే కేటాయిస్తారు, మిగిలిన సమయం వారి శారీరక ఎదుగుదలకు తోడ్పడే ఆటల్లోను, మానసిక ఎదుగుదలకు సృజనాత్మకతకు సంబందించిన విషయాల్లో పాలుపంచుకునేలా చూస్తారు .. ఈ విధంగా అక్కడి విద్యావిధానం ఉండటం వల్లే ప్రపంచం మొత్తం మీద విద్యావ్యవస్థ అంటే ఫిన్లాండ్ మాత్రమే అన్న విధంగా పేరుతెచ్చుకుంది.

అదే మన దగ్గర చూసుకుంటే బండెడు పుస్తకాల సంచులు మోసే కూలీలు గానే పిల్లలను తయారు చేస్తున్నారు ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు. అదే ప్రభుత్వ పాఠశాలల తీరు చూస్తే పిల్లలకు ఈ కష్టాలు లేవు కాకపోతే సరైన వసతులు, మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణా లోపం ప్రభుత్వ పాఠశాలల పాలిట యమపాశం లా మారింది.
నిజానికి ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు అక్కడి బోధనాసిబ్బంది నిర్లక్ష్యం మాత్రమే కాకుండా ఆయా పరిసరాల్లో నివసించే తల్లితండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది. మంచి పేరున్న ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చదివించడం ఒక హోదాల మారిపోయింది తల్లితండ్రులకు, మా వాడు పలానా స్కూల్ లో చదువుతున్నాడు అని గర్వంగా చెప్పుకోవడం చూస్తుంటే వారికి తమ పిల్లలను ఫారం కోడుల్లా తయారు చేస్తున్నాం అన్న విషయం స్ఫురణకు రాకపోవడం దురదృష్టకరం. ఇలా గర్వంగా చెప్పుకునే విషయంలో చూపే శ్రద్ధ తమ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల మీద పెట్టి అక్కడి మౌలిక వసతుల గురించి, బోధనాపద్ధతుల గురించి నిలదీసే విషయంలో చూపరు. ఒకవేళ తల్లితండ్రులలో ఈ చైతన్యం వచ్చిన రోజున ప్రభుత్వ పాఠశాలలు ఏ కార్పొరేట్ పాఠశాలల కు తీసిపోవు

నిజానికి కార్పొరేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధన మంచి విజ్ఞానభరితంగా ఉంటుంది, కానీ పర్యవేక్షణా లోపం ఒక్కటే ఇక్కడ ఇబ్బంది. ఉపాధ్యాయులు మంచి శిక్షణ కలిగి ఉంటారు, ఏ తరగతి పిల్లలకు ఎలా చెప్పాలి అన్న విషయం మీద మంచి పట్టు వీరికి ఉంటుంది, ఎందుకంటే వీరు ఆ విధంగా శిక్షణ తీసుకొని ఉంటారు కాబట్టి. అదే ఏదైనా కార్పొరేట్ పాఠశాల లో చూస్తే అక్కడ ఉపాధ్యాయులకు పిల్లల వయసు, వారి మానసిక పరిపక్వత మీద ఎక్కువగా దృష్టి ఉండదు, కేవలం తమకు వచ్చిన సమాచారం అంతా పిల్లల మెదళ్లలోకి తోసెయ్యాలి అన్న తపన తప్ప మరొకటి ఉండదు. పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంది, మనం చెప్పేది అర్థం చేసుకునే వయసు కానీ, మానసిక స్థితి కానీ వారికి ఉందా లేదా అన్నది ఆలోచించడం తక్కువ.
పైపెచ్చు ఈ కార్పొరేట్ పాఠశాల లో వసూలు చేసే డబ్బులు లక్షల్లో ఉంటాయి, పిల్లల ను చదివించడానికి తల్లితండ్రులు జీవితాంతం కష్టపడినా కూడా అప్పుల పాలు కావడం తప్పదు. అంతగా అప్పులు చేసి పిల్లలను మానసిక రోగులుగా తయారు చెయ్యడం లేదా వారు మానసిక ఒత్తిడి తట్టుకోలేక అర్థాంతరంగా తనువు చాలించడం ఇవేనా తల్లితండ్రులు కోరుకునేది….

రీసెంట్ గా హైద్రాబాద్ సిటీ లో ఎక్కువగా ఈవ్ టీజర్లు, రేసింగ్ కి వెళ్లి ఆక్సిడెంట్ ల పాలు అయ్యే మైనర్ల వివరాలు చూస్తే చాలా మంది కార్పొరేట్ స్కూల్ లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒక్కసారిగా రెక్కలు వచ్చేసరికి విచ్చలవిడితనానికి అలవాటు పడటం, వాటి వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా సాధారణ విషయంగా మారింది.

కారణం ఒక్కటే అదే మానసిక ఒత్తిడి. విద్య వినయ సంపన్న సిద్ధిరస్తు అని దీవించే పెద్దల దీవెనలో విజ్ఞానం తో పాటు వినయం కూడా నేర్చుకోవాలి అని చెప్తారు. కానీ ఇప్పుడు విజ్ఞానం లేదు, వినయం లేదు… కేవలం ఒక పుస్తకాన్ని బట్టీ పట్టే యంత్రాలు తప్ప.

ఏమి చేస్తే రేపటి తరాలు విజ్ఞానం, వినయం రెండూ సంపాదించుకోగలుగుతారో మీరే చెప్పండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *