కేసిఆర్ కొత్త ఫ్రంట్ ముచ్చట

ఇన్నాళ్లు ఏ మాత్రం గుర్తుకురాని పక్కరాష్ట్రాల కష్టాలు సడన్ గా సారుకు గుర్తుకురావడం కొద్దిగా విచిత్రమే అనిపించినా ఎన్నికల సమయానికి గుర్తుకురావడం మట్టుకు మంచిదే. ఈ ఆలోచన మీద నావి  కొన్ని ప్రశ్నలు, అభిప్రాయాలూ దొరగారికి వినమ్రుడనై రాస్తున్న. జవాబులు ఎవ్వరైనా ఇవ్వొచ్చు.
ఇక మద్దతు సంగతి అంటారా, మీ భాష చూసి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎక్కువగానే వస్తారు, నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం, ఆనక మా తెలంగాణా యాస ల గిట్లనే అంటాం అని తెలంగాణా యాస వెనుక దాక్కుంటారు, విజయనగరం లో పుట్టలేదు సార్ తెలంగాణా యాస, మాకు తెలియని తెలంగాణా యాసనా చెప్పండి.
ఇక దేశ రాజకీయాల్లో పెనుమార్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు బావుంది సార్, రెండు జాతీయ పార్టీలకు పోటీగా థర్డ్ ఫ్రంట్ ఒకటి ఉండాలి తప్పులేదు, ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్ష ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది, ఇప్పుడు కేంద్రం నుండి మన రాష్ట్రం వరకు పరిస్థితి ఇదే కదా బలమైన ప్రతిపక్షం లేకపోవడం. అందుకే మీరు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంది.
ఇక ఢిల్లీ కి పోతా అన్నావ్, ఆశ ఉండటం లో తప్పు లేదు, కానీ మీ ఉత్తుత్తి ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు ఉస్మానియా యూనివర్సిటీ లోకి వెళ్లే ధైర్యమే లేని మీరు, ఢిల్లీ కి పోతా అనడం కొంచం హాస్యాస్పదంగానే ఉంది. ఇక్కడి నిరుద్యోగులకు మీరు చేసింది ఏమిటో తెలుసు, యూనివర్సిటీ లోని విద్యార్థులకు తెలుసు అందుకే మిమ్మల్ని అక్కడికి రానివ్వరు అన్న విషయం ఢిల్లీ లో మాత్రం చెప్పకండి. నిరుద్యోగ సమస్య దేశమంతా ఉంది, అప్పుడు మిగతా ఏరియా లోకి కూడా రానివ్వకపోతే కష్టం.
అవును చెప్పడం మరిచాను, పొరపాటున కూడా కేంద్రం లో థర్డ్ ఫ్రంట్ గెలిస్తే దళితున్నే పీఎం చేస్తా లేకుంటే తలనరుక్కుంటా అని మాత్రం చెప్పకండి, ఇన్నాళ్లు కేవలం తెలంగాణా లో పోయిన మీ పరువు, ఈ మాట పుణ్యమా అని దేశం మొత్తం మీద పోతుంది.
బంగారు తెలంగాణా చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చారు, మీకు గుర్తుందో లేదో మీరు అధికారంలోకి వచ్చాక  సంతకం చేసిన ఫైల్ ఎదో యాదికుందా సారూ, హైదరాబాద్ మొత్తం మీద దాదాపు 190 కల్లు కాంపౌండ్ లు ఓపెన్ చెయ్యడానికి పర్మిషన్ ఇచ్చారు.. అసలు మన తెలంగాణా లో అది కూడా సిటీ కి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వ్యాసంలో ఉన్న తాళ్లు (తాటిచెట్లు ), ఈతచెట్లు ఎన్ని, అవి ఎన్ని లీటర్ల కల్లు ఇస్తాయి, ఒక్కో కాంపౌండ్ కు ఎంత సప్లై చేస్తాయో లెక్క తెలియకుండానే అనుమతి ఇచ్చారా, ఇప్పుడు తయారు అవుతున్న కల్తీ కల్లు తాగి మెయిన్ రోడ్ల మీద పడిపోయిన వారి సంఖ్య చూస్తున్నారా.  పీఎం అయితే కూడా ఇలాంటి ఫైల్ ఏదైనా ఉందేమో చూస్తారా
అందరినీ కూడగట్టుకొని కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పావ్ సార్, అది చాలా బావుంది కానీ అందులో మీరు తోక పార్టీల సహాయం కూడా తీసుకుంటాను అనడం ఇంకా దారుణంగా ఉంది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు, నిజమే కానీ ఇలా తెలంగాణ సాధన కోసం విద్యార్థులు బలిదానాలు చేస్తున్న సమయంలో కూడా ఉద్యమానికి మద్దతు ఇవ్వని  తోక పార్టీల కలయికతో మీరు సాధించేది ఏమిటో కూడా చెప్పండి.
ఇక మీ తోటి సీఎం చంద్రాలు సారూ గురించి చెప్పేది ఏముంది, అందరితోపాటు ఆయన్ని కూడా కలుపుకుపోతారా లేకపోతే ఓటుకు నోటు, సీఎం ఫోన్ ట్యాప్ కేసులు బతికే ఉంటాయా. నాకు తెలిసి కలుపుకుపోయేలాగే ఉన్నారు, ఎంతైనా ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ పేరుతో కూటమి ఏర్పాటు చేసి చక్రం తిప్పిన అనుభవం ఆయనకు మెండుగా ఉంది, సో కలుపుకునే అవకాశం ఉంటుందనే ఆశిస్తున్నాం.
కొందరేమో త్రిపుర ఎన్నికల ఫలితం తరువాత మీరు కొత్తగా, సడన్ గా ఈ కూటమి గురించి ఆలోచిస్తున్నారు అంటున్నారు, పర్లేదు అనుకునేవాళ్లు అనుకుంటారు కానీ చేసిన తప్పులు మళ్ళీ చెయ్యకుండా జాగ్రత్త పడండి చాలు. జాతీయ మీడియా కి కొంచం నోరెక్కువ, మీరు ఎమన్నా అంటే అంత త్వరగా వదిలిపెట్టరు, కాబట్టి మన టీ న్యూస్ ఛానెల్ ని తెరాస పార్టీ కార్యాలయం నుండి ఢిల్లీ కి,  తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ ఇంగ్లీష్ భాష లకు కూడా విస్తరించే ప్రయత్నం చెయ్యండి ముందు, లేకపోతే మనం చెప్పేది సోది అయినా అవతలివాడికి అర్థం కావాలి కదా.
మిగతా రాష్ట్రాల వారిని, దేశాల వారిని సంబోదించేటప్పుడు వాడు, వీడు అని మట్టుకు అనకండి, మా తెలంగాణా ల ఇంతే అని చెప్పుకునే అవకాశం ఉండదు, అయింత వాడు యుద్ధం అంటే మనకు ఫామ్ హౌస్ లు తక్కువున్నాయి, అవును యాదిమర్శిన  ఢిల్లీ లో కూడా ఫామ్ హౌస్ ఒకటి పెట్టుకోవాలె చూడండి, మనకు ఇష్టమైన ప్రదేశం కదా అది. తోట కు మట్టుకు జాగా కష్టం లెండి.
ఇక మిగిలింది ఇతర రాష్ట్రాల నాయకులను, పార్టీలను కలిసి ముచ్చట వెట్టి వాళ్ళ మద్దతు కూడగట్టడం, దానికి మన కేటీఆర్ గారిని వాడండి కొంచం మాటకారి కదా, వారితో నైస్ గా మాట్లాడితేనే పని అవుతుంది చూడండి, నువ్వెంత అంటే నువ్వెంత అని అప్పుడెప్పుడో తెలంగాణా ద్రోహులు, ఆంధ్రాగాళ్ళు అన్నట్లు మాట్లాడితే మట్టుకు వాళ్ళు నిన్ను దగ్గర గుడ్క రానియ్యరు జాగ్రత్త సారూ.
ఇక మన పాలన గురించి వాళ్లకు పొరపాటున గుడ్క చెప్పకండి, దాదాపు 1 లక్షా 40 వేల కోట్ల రూపాయల మిగులు ఆస్తులతో  ధనిక రాష్ట్రం గా ఏర్పడ్డ తెలంగాణా నేడు దాదాపు 3 లక్షలకు పైగా అప్పులతో ఉంది అన్న విషయం మట్టుకు అక్కడ చెప్పకండి, పైసలు ఏమి చేసిండ్రు అని అడిగితే మన గుంతల తోటి ఉన్న హైద్రాబాద్ రోడ్ల ను సూపెట్టాల్సి వస్తుంది.
మీ ప్రయత్నం మంచిగనే ఉంది కానీ, తెలంగాణా పరువు తీసే పనులు మట్టుకు జెయ్యకు దొరా ..
జెర పైలం అసలే శానా దూరం పోవాలే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *