మంగళ్ పాండే – మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు

మంగళ్ పాండే .. భారత స్వాతంత్ర్యపోరాటానికి స్ఫూర్తినిచ్చిన యోధుడు.

1827 జులై 19 న ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మామూలు మనిషి పాండే. అప్పట్లో ఉన్న భూస్వామ్య వ్యవస్థ లో కేవలం పొలం పనులు చేసుకొని పొట్టపోసుకోవడం తప్ప మరేమి తెలియని చెయ్యలేని కుటుంబంలో పుట్టినా కూడా శారీరకంగా కన్నా (పుష్టికరమైన భోజనం చేసే స్థోమత లేకపోవడం వల్ల) మానసికంగా దృఢమైన వ్యక్తి పాండే. ప్రతి రోజు వ్యాయామశాలలో గడిపినా కానీ సమృద్ధికరమైన భోజనం చేసే పరిస్థితులలో అతని కుటుంబం లేదు. చెయ్యడానికి మరో ఉపాధి మార్గం కూడా లేదు.

ఎంత పని చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం లభించని రోజులు అవి. దాదాపు 22 ఏళ్ళ వయసులో తెలిసిన వారి ప్రోద్బలంతో బ్రిటిష్ సైనికదళంలో సిపాయి గా చేరాడు. అక్కడ శిక్షణ తరువాత బెంగాల్ పదాతి దళంలో 6వ కంపెనీ కి కేటాయించారు. పెద్దగా వార్తావివరాలు తెలుసుకోలేని కంటోన్మెంట్ జీవితం అయినా కూడా, సెలవులకోసం ఇళ్లకు వెళ్లి వచ్చిన చాలామంది సైనికుల ద్వారా బయటి ప్రపంచపు వార్తలు వారికి తెలిసేవి.

హిందుస్థాన్ లో జరుగుతున్న బ్రిటిష్ వారి అకృత్యాలు, దానికి వ్యతిరేకంగా స్థానిక నాయకులలో ఎగసిపడుతున్న అసమ్మతి జ్వాలల గురించి వార్తలు తెచ్చేవారు. అప్పటి స్థానిక నాయకులు ఐకమత్యంతో పోరాటం చెయ్యాలని తారీకు ను కూడా నిర్ణయించుకున్నారు, అందుకు 1857 మే 31 సరిఅయిన తేదీ అన్నట్లు నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు సైన్యాన్ని మీరట్ కు తరలించారు.

మంగళ్ పాండే లో అప్పటికే బ్రిటిష్ పాలకుల అకృత్యాల గురించి అసమ్మతి బాగా పెరిగిపోయింది.. ఇది ఇలా ఉండగానే మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా బ్రిటిష్ వారి తుపాకుల తూటాల తయారీలో ఆవు, పంది కొవ్వు ను వాడుతున్న విషయం బహిర్గతమయ్యింది. నిజానికి హిందువులు, ముస్లిములు ఈ రెండింటిని తమ మతవిశ్వాసాల ప్రకారం వాడేందుకు సిద్దముగా ఉండరు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇందులోని నిజాలను నిర్ధారించుకున్న తరువాత మంగళ్ పాండే కొఠానికి అంతు లేకుండా పోయింది. మతవిశ్వాసాలను కించపరిచే విధంగా బ్రిటీషు వారు చెయ్యడంతో ఆవేశంతో ఊగిపోయాడు పాండే..

ఈ విషయాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు, తోటి సైనికులతో కలిసి పోరాటానికి సన్నద్ధం కావాలని అందరిలో దేశ భక్తి స్ఫూర్తి నింపడం మొదలుపెట్టాడు. కానీ ఈ విషయం త్వరగానే బ్రిటిష్ సైనికాధికారులకు తెలిసి పోయింది. సైనికులలో తిరుగుబాటు కనపడతుంది, వీరందరికీ నాయకత్వం వహిస్తున్నది మంగళ్ పాండే అన్న విషయం తెలియగానే దిద్దుబాటు చర్యలు చేపట్టింది బ్రిటిష్ ప్రభుత్వం.

మంగళ్ పాండే బ్రిటిష్ వారి చర్యలకు వెనక్కు తగ్గకుండా, తమ దగ్గర ఉన్న తుపాకులతో ఏ బ్రిటిష్ అధికారి కనపడినా కానీ దాడి చెయ్యమని తన తోటి సైనికులందరికీ దిశానిర్దేశం చేసాడు. మన హక్కుల కోసం, మన స్వాతంత్య్రం కోసం మనం మాత్రమే పోరాడాలి అని చెప్పి అందరినీ సమాయత్తపరిచాడు.. అదే సమయంలో తనకు ఎదురుగా వచ్చిన Lieutenant Baugh గుండెలకు గురిపెట్టి కాల్చాడు, కానీ అది పొరపాటున గురి తప్పి ఆయన గుఱ్ఱానికి తగిలి బ్రతికిపోయాడు. Baugh తన తుపాకీ తో తిరిగి దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో పాండే తన చేతిలోని తుపాకీతో కొట్టబోగా మరో బ్రిటిష్ అధికారి సార్జెంట్ హ్యూసన్, పాండే చేతిలోని తుపాకీ పడగొట్టాడు.

ఈ చర్య కు భీతిల్లిన బ్రిటిష్ అధికారులు వెంటనే మంగళ్ పాండే ని అరెస్ట్ చెయ్యమని సిపాయిలకు ఆదేశం జారీ చేసాడు, కానీ దేశభక్తితో స్ఫూర్తి నింపుకొని ఉన్న సైనికులు ఎవ్వరూ ఈ అరెస్ట్ కు ముందుకు రాలేదు.. చివరికి మేజర్ జనరల్ వచ్చి సైనికులకు ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.

ఇక తన తిరుగుబాటు ఇక్కడితో ముగిసేలా ఉంది అని అనుకున్న పాండే, తెల్లవారి చేస్తికి చిక్కడం ఇష్టం లేక తనను తానే కాల్చుకోడానికి సిద్ధపడ్డాడు. తుపాకీ తో కాల్చుకోగలిగాడు కానీ ప్రాణం తీసుకోలేకపోయాడు. గాయాలతో ఒరిగిపోయిన మంగళ్ పాండే ని ప్రాణాలతో బంధించాలి అన్న బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆసుపత్రి లో చేర్చారు.

అప్పటికే మంగళ్ పాండే చేసిన సిపాయి తిరుగుబాటు పోరాటం గురించి దేశంలోని అన్ని ప్రాంతాలకు వార్త చేరింది… స్ఫూర్తి పొందేవారు, భయపడేవారు, దేశభక్తి రగిలినవారుగా ప్రజలు, సిపాయిలు మారడం చూసి బ్రిటిష్ ప్రభుత్వం పాండే మీద త్వరితగతిన విచారణ జరిపి శిక్షించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆయనకు ఉరి శిక్ష విధించింది.

మార్చ్ 29 న తాను చేసిన తిరుగుబాటు తనంతట తాను పూర్తి బాధ్యతో, తన దేశం కోసం ధర్మం కోసం నేను మాత్రమే చేసాను అని ప్రకటించాడు పాండే. పాండే మార్చ్ 29, 1957 లో తిరుగుబాటు చేస్తే ఏప్రిల్ 18 న ఆయన్ని ఉరి తీయాలని ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. వారి ఆలోచన కేవలం ఎంత త్వరగా ఆయన్ని ఉరి తీస్తే అంత మంచిది అన్నది.

కాకపోతే అప్పటికే పరిస్థితి బ్రిటిష్ వారి చెయ్యి దాటి పోయింది, మంగళ్ పాండే వీరోచిత తిరుగుబాటు గురించి తెలుసుకున్న చాలా మంది సంస్థానాధీశులు, పల్లెటూర్లు, యువకులు, సిపాయిలు ఉత్తేజితులై తిరుగుబాటు కు సిద్దమయ్యారు.. ఇంకా వేచి చూస్తే ఇంకా ఈ తిరుగుబాటు జ్వాల ఎక్కువవుతుంది అని భావించిన బ్రిటిష్ వారు ఏప్రిల్ 8 వ తేదీనే ఆయన్ని ఉరి తీశారు.

ఉరి తీసినా కూడా మంగళ్ పాండే చేసిన తిరుగుబాటు ఇంకా అతని మిగిలిన సైనిక సహచరులతో ఉంటుంది అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ బెంగాల్ పదాతి దళాన్ని మొత్తానికే రద్దు చేసింది. అతన్ని పట్టించడానికి ప్రయత్నించిన వారికి సత్కారాలు కూడా చేసింది.

ఏది ఏమైనా మంగళ్ పాండే తిరుగుబాటు ప్రాముఖ్యత లేకుండా పోలేదు, ఆయన స్ఫూర్తిదాయక సిపాయి తిరుగుబాటు బరాక్ పూర్ నుండి మొదలయ్యి, మీరట్, ఢిల్లీ, కాన్పూర్ మరి లక్నో వరకు వ్యాపించింది. యుద్ధంలో గెలవలేకపోయినా కూడా మిగిలిన అందరిలో తిరుగుబాటు తీసుకు వచ్చిన మంగళ్ పాండే గారు మొదటి స్వాతంత్ర్య సమరయోధుడుగా మిగిలిపోయాడు. ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే..

జైహింద్

One thought on “మంగళ్ పాండే – మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *