మోడీ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతుందా

అటు తెలుగు రాష్ట్రాల సామాన్యుల్లోనూ, ఇటు సోషల్ మీడియా లోనూ బీజేపీ కి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నట్లు కనపడుతుంది.
కేవలం నాలుగంటే నాలుగు సంవత్సరాలలో ఎందుకు ఈ మార్పు, అఖండ మెజారిటీ తో బీజేపీ ని గెలిపించిన అనేక సామాన్య జనాలలో సైతం బీజేపీ మీద ఒకరకమైన నిర్లిప్తత కనపడటంలోని ఆంతర్యం ఏమై ఉండొచ్చు.

నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమి మాట్లాడలేని ప్రధాని ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అని అనుకున్న ప్రజానీకానికి, వీళ్ళ స్కాం ల వల్ల అయితేనేమి, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులవల్ల అయితేనేమి ఒక రకమైన ఏహ్యభావం ప్రజల్లో ఏర్పడింది. దానికి తోడు కుటుంబ పాలన అన్న అపవాదు ఎలాగూ ఉండనే ఉంది (మన్మోహన్ కేవలం ఒక బొమ్మ అన్న విషయం ప్రజల్లో బలంగా నాటుకుపోవడం వల్ల, పరిపాలన చేస్తున్నది సోనియా గారే అని అందరి నమ్మకం). అదీ కాక యువరాజు గారి సమక్షంలో కూడా ప్రధాని గారు చేతులు కట్టుకు నిల్చున్న చాలా ఫోటోలు అప్పట్లో నెట్ లో చక్కర్లు కొట్టాయి.. ఇవన్నీ అప్పటి ప్రధాని నిస్సహాయత ను, ఏ విషయంలో కూడా సొంత నిర్ణయం తీసుకోలేని ప్రధాని గా జమకట్టేసారు.

అదే సమయానికి గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ అంటూ మోడీ రావడం, ఆయన మాటల చాతుర్యంలో ప్రజలను వివశులను చేయడంలోనూ ఆయన నైతికంగా ఒక నమ్మకం కలిగించాడు. ఈయన్ని తిప్పికొట్టగల నాయకులు కాంగ్రెస్ లో లేకపోవడం, ఉన్నా కానీ తమ మీద ఉన్న స్కాం ల ముద్ర చెరిపివేసుకునే సాహసం చేయలేకపోవడం, కుటుంబ పాలన ని చూపిస్తూ తిరిగి యువరాజు గారు ఎన్నికల సమయంలో హామీలు గుప్పించడం కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ గా పరిణామించింది. మరోవైపు మోడీ తన ఛరిస్మా ను కొనసాగించడం గుజరాత్ లో విపరీతమైన అభివృద్ధి జరిగిపోయింది, అదే అభివృద్ధి దేశమంతా చేస్తాను అంటూ ఆయన చేసిన ప్రసంగాలు చాలా మందిని ఆకర్షించిన మాట వాస్తవం. దాని ఫలితమే మిగతా పార్టీలను, మదపుటేనుగు లాంటి కాంగ్రెస్ ను కాదని చెప్పి ప్రజలు బీజేపీ కి పట్టం కట్టారు.

ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ విభజన పేరుతో కాంగ్రెస్ ఆడిన నాటకంలో బాగా నష్టపోయింది అవశేష ఆంధ్రప్రదేశ్ .. దానికి ప్రత్యుపకారంగా ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి ఆశ పెట్టినా కూడా పరిస్థితి చెయ్యిదాటిపోవడం కాంగ్రెస్ అటు తెలంగాణ లోను, ఇటు ఆంధ్రప్రదేశ్ లోను చతికిలపడటమే కాకుండా మోడీ మాటల వల్ల దేశం మొత్తం మీద దెబ్బతిన్నది.

ఇక ఎన్నికల తరువాత మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చాలామందిలో ఆశలు రేపాయి.. అదే సమయంలో విజయ్ మాల్యా బ్యాంకులను ముంచి దేశం విడిచి పారిపోవడం ప్రతిపక్షాలకు చిన్న అస్త్రంలా దొరికింది. నిజానికి గుజరాత్ లో జరిగిన అభివృద్ధి ఎంత అన్నది పక్కన పెడితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి చేస్తాను అని చెప్పిన మోడీ ఒకానొక సమయంలో తీసుకున్న తీవ్ర నిర్ణయాలు సామాన్యప్రజలకు ఇబ్బంది కలిగించినా కూడా తరువాత జరగబోయే మంచికే అవి అని సరిపెట్టుకున్నారు.

కానీ కాలానుగుణంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో చాలా పొరపాట్లే చేసింది నేటి మోడీ ప్రభుత్వం, ఉదాహరణకు ఎక్కువగా ప్రస్తావించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగిన అన్యాయం. పోటాపోటీగా 5 కాదు 10 సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇవ్వాలి అని చెప్పిన బీజేపీ పార్టీయే ఇప్పుడు అది అవసరం లేదు ఏపీ కి అంటూ మాటతప్పడం చాలా అన్యాయం. ఇస్తామని చెప్పిన ప్రత్యేకహోదా విషయంలో వెనకడుగు వెయ్యడమే కాకుండా ప్యాకేజీ అంటూ మాటలు చెప్పడం, ఆనక దానికి కూడా ప్రత్యేక ప్రతిపత్తి కలిగించకపోవడం గమనార్హం. పోనీ చెప్పిన మేరకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఒకానొక సమయంలో మర్చిపోవడం ఒక జాతీయ పార్టీ కి తగని రీతిలో కొనసాగింది.

పోనీ అదేమన్నా తమ ప్రత్యర్థుల పాలనలో ఉన్న రాష్ట్రమా అంటే అది కూడా కాదు, తమ మిత్రపక్షం తో కలిసి ఉన్న రాష్ట్రమే కదా,అక్కడి ప్రభుత్వం లో తమవారు, ఇక్కడి ప్రభుత్వంలో వారు కూడా కలిసిఉన్న సమయంలో పట్టువిడుపులు లేకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరించడం కూడా తప్పే అవుతుంది. నిజానికి ప్రత్యేక హోదా వచ్చే విషయంలో ఏపీ పరిస్థితులు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుకూలంగా లేదు అన్న విషయం ఎన్నికల ముందు బీజేపీ కి తెలియదా అన్నది కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఎదో ఒక రకంగా సర్దుబాటు చేసుకోవాల్సిన సమయంలో కూడా తెగతెంపులు చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు అంటే ఇది కావాలని చేసిన పనా లేక చంద్రబాబు ప్రభుత్వం ఏపీ లో బలంగా ఉన్నంతకాలం అక్కడ బీజేపీ బలపడటం జరగదు అన్న ఆలోచనతోనా అన్నది తేలాల్సివుంది.

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఒక ఎత్తుకైతే, ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తో కొద్దిగా లోపాయికారి ఒప్పందం జరిగినట్లు వార్తలు వెలువడుతున్నప్పుడైనా స్పందించాల్సిన అంశం వదిలేసి, లెక్కలు చెప్పండి అని అడగడం వారి లోపభూయిష్టమైన విషయాలే బయటపెట్టింది కానీ మరొకటి కాదు. వైసీపీ తో పొత్తు పెట్టుకునే ఆలోచన ఒకవేళ బీజేపీ చేసి ఉన్నా కూడా ప్రజల్లో అది ఎలాంటి అభిప్రాయాలకు తావిస్తుందో అన్నది ఆలోచించకపోవడం తప్పిదమే అవుతుంది.

 

వైసీపీ తో పొత్తు : ఒకవేళ టీడీపీ తో తెగతెంపులు చేసుకొని వైసీపీ తో వెళ్లాలని అనుకుంటే అది రెండు పార్టీలకు నష్టం జరిగే విషయంగానే పరిణమిస్తుంది కానీ లాభం మాత్రం చేకూరే అవకాశం కనపడటం లేదు. నిజానికి అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తుల వ్యవహారం, ఆదాయానికి మించి ఆస్తులు ఇలా అనేక రకాల నేరాల తో సతమతమవుతున్న వైసీపీ నాయకుడికి బీజేపీ అఫర్ బాగానే కనిపించి ఉండవచ్చు, కేసుల మాఫీ కి ఈ సయోధ్య ఉపయోగపడే అంశం గా మారే అవకాశం ఉంది. కానీ వైసీపీ సైతం ప్రత్యేకహోదా కోసమే బీజేపీ తో చెలిమి అని చెప్పే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు టీడీపీ తో కలిసి ఉండి కూడా ప్రత్యేకహోదా ఇవ్వని బీజేపీ, వైసీపీ తో కలిసి ఎలా ప్రత్యేక హోదా ఇస్తుంది అని ప్రజల నుండి ఆలోచన వస్తే జవాబు చెప్పగల అంశాలు రెండు పార్టీలలోనూ లేవు.
వారితో చెలిమిగా ఉండి కూడా ప్రత్యేకహోదా ఇవ్వని బీజేపీ, ఇప్పుడు వైసీపీ తో అంటకాగి ఎలా ఇస్తుంది అన్న నమ్మకం ప్రజల్లో ఎలా కలిగిస్తారు. ప్రస్తుతానికి ఏపీ లో బీజేపీ పైన ప్రజలు నమ్మకద్రోహం అనే కోపంతో రగులుతున్నారు అన్నది వాస్తవం, ఇప్పుడు దానికి వైసీపీ తోడైతే వైసీపీ కూడా ఆ మంటల్లో కాలిపోవడం సహజం.

ఏది ఏమైనా బీజేపీ ప్రత్యేకహోదా విషయంలో చేసిన తప్పును ఉపశమనంతో కూడిన దిద్దుబాటు చర్యలు చేస్తే కొద్దిగా నమ్మకంతో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి లేకపోతే , దక్షిణాది రాష్ట్రాల ఐకమత్యం లేదా కెసిఆర్ చెప్తున్న కొత్తఫ్రంట్ తో మోడీకి దెబ్బపడే అవకాశం బాగానే ఉంది .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *