తెలంగాణా పొత్తులు – తెలుగుదేశం తిప్పలు

KCR + CBN

చంద్రబాబు వ్యాఖ్యల్లో ఏదైనా తేడా కనిపిస్తుందా, మొన్నటివరకు ఒకరంటే ఒకరు కత్తులు దూసుకున్న కెసిఆర్ మరియు సీబీఎన్ లు ఎన్నికల వేళకి కలిసే అవకాశం ఉండే ఉంటుంది అనిపిస్తుంది.
పోయిన సారి ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం తరువాత జరిగిన పరిణామాలు చాలావరకు బాబు కు నిరాశ కలిగించే అంశంగానే పరిణమించాయి అనుకోవచ్చు.
చాలామటుకు ఎమ్మెల్యే లు పార్టీ మారి, అందులో కొందరు మంత్రులైన సంఘటనలు బాబు కు ఆశనిపాతం లాంటివే అనుకోవచ్చు. వీటిపైనా పోరాడుతున్న సమయంలోనే ఓటు కు నోటు పేరుతో రేవంత్ దొరికిపోవడం ఆ కేసు వల్ల నో లేక పరిపాలనా సౌలభ్యం కోసమో చంద్రబాబు అమరావతి కి వెళ్లడం ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా తయారు అయ్యింది అన్నది వాస్తవం.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన పార్టీ కాస్తా తన ఉనికి కూడా నిలుపుకునే పరిస్థితి నుండి గట్టెక్కడానికి ప్రయాసలు  పడుతున్న సమయంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ లోకి మారడం తో ఇంకా అగమ్యగోచరంగా మారింది. పొత్తుల పరిస్థితి ఊహించే రేవంత్ కాంగ్రెస్ పార్టీ కి మారారని కొందరు విశ్లేషకులు అంటున్న మాట.
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మిగిలిన అవశేష తెలంగాణా తెలుగుదేశం పార్టీ ని తెరాస లో విలీనం చెయ్యమని మోత్కుపల్లి గారు అడగడం లో తప్పేమి లేదనే అనుకోవచ్చు. ఏ రకంగా చూసిన అక్కడ ఉన్న తెరాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుండి మొదలుకొని దాదాపు సామాన్య కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినవారే కదా.
మొన్న జరిగిన మీటింగ్ లో కార్యకర్తల అభీష్టం మేరకే పొత్తులు ఉంటాయి కానీ విలీనం ఉండదు అని చంద్రబాబు గారు చెప్పడం చూస్తుంటే కొన్ని రకాల ఊహాగానాలు రాకపోవడం లేదు.
ప్రస్తుతం తెలంగాణా లో బలంగా ఉన్న పార్టీలు రెండే అందులో ఒకటి అధికారంలో ఉన్న తెరాస రెండవది క్షేత్రస్థాయి లో ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్, కొత్తగా జనసేన లాంటి పార్టీ లు, పాత  కమ్యూనిస్ట్ పార్టీలతో పెద్దగా వచ్చే లాభం కానీ, నష్టం కానీ ఏమి ఉండవు. ఇక మిగిలింది బీజేపీ, దీనికి హైదరాబాద్ పరిధిలో మినహా గ్రామస్థాయి లో బలమైన క్యాడర్ లేకపోవడం పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు, సరిఅయిన దిశానిర్దేశం చేసే బలమైన నాయకులు లేకపోవడం మరో దెబ్బ.
కొత్తగా కోదండరాం గారి పార్టీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో ఇంకా వేచి చూడాలి, తెరాస కుటుంబ పాలన కు వ్యతిరేకంగా బంగారు తెలంగాణా సాధనే తన ద్యేయమని కోదండరాం గారు ముందుకు రావడం మంచిదే, కానీ కేసీఆర్ సెంటిమెంట్ ప్రదర్శించిన  స్థాయి లో కోదండరాం గారు రాణిస్తారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.
ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఏపీ లో మిత్ర ధర్మం తప్పిందన్న బాధలో ఉన్న చంద్రబాబు తెలంగాణా లో బీజేపీ తో పొత్తులో ఉంటారని అనుకోవడం అత్యాశే , ఇక ఆయనకు మిగిలింది తెరాస లేదా కోదండరాం గారి కొత్త పార్టీ .. ఎక్కువ శాతం చంద్రబాబు కూడా తెరాస వైపే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. బీజేపీ కోదండరాం గారితో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ఇంకో ఎత్తు .. వేచి చూడాలి మరి … క్షణ కాల చిత్తములు నేటి రాజకీయ నాయకుల మదులు అని .. ఎప్పుడు ఎలా ఉంటారో మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *