భారత దేశంలో మహిళల భద్రత

ప్రపంచంలో మహిళలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని తమ తాజా సర్వేలో వెల్లడైనట్లు థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ ప్రకటించింది.

రాయిటర్స్ తాజాగా విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం.. అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతున్న అఫ్గానిస్తాన్, సిరియాలు.. ఇండియా తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఏడేళ్ల కిందట 2011లో నిర్వహించిన ఇదే సర్వేలో భారతదేశం నాలుగో స్థానంలో ఉండగా.. ఇప్పుడు ప్రధమ స్థానంలోకి వచ్చిందని సర్వే సంస్థ వెల్లడించింది.

వీటి నిజానిజాలను విశ్లేషణ చేస్తే, అసలు పబ్లిక్ గా స్త్రీ కి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని దేశాలు వెనకవరసలో ఉండటం, స్త్రీలు పాలనారంగంలో ముందంజలో ఉన్న భారత దేశం మొదటి స్థానంలో ఉండటం ఈ సర్వే ఎలా జరిగిందో అర్థం అవుతుంది.

ఇక సర్వే జరిగిన తీరు కూడా విచిత్రంగా ఉంది.. దాదాపు 132 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో కేవలం 548 మంది అభిప్రాయాలను దేశం మొత్తానికి ఆపాదించడం హాస్యాస్పదం…
నిజానికి కనీసం దేశంలో ఒక 15% ప్రజల అభిప్రాయం అయినా ఇలా ఉంటే అప్పుడు కొద్దిగా ఈ సర్వే యొక్క నిజాయితీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది.
ఈ సర్వే యొక్క నిజాయితీని దేశం కూడా ఖండిస్తున్న వేళ దీనికి ప్రముఖంగా ప్రచారం కల్పించిన మీడియా తప్పు కూడా చాలా ఉంది. 132 కోట్ల కు పైగా ఉన్న జనాభా లో కేవలం 548 మంది అభిప్రాయం బలవంతంగా రుద్దడం ఆ సంస్థ చేసిన తప్పు. దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది. దేశం మీద ఇలా నిందలు వేసే సంస్థల నిజాయితీ ని చట్టపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం కేంద్రానికి ఉందనే అనుకుంటున్నా.

అలా అని దేశంలో మహిళల మీద అకృత్యాలు జరగడం లేదు అని మాత్రం అనలేము. రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, పరువు హత్యలు కొద్దిగా ఆందోళన కలిగించిన మాట వాస్తవం. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా ఇలా మితిమీరి ప్రవర్తించడం ఇవి అన్నీ టెక్నాలజీ పెరగని రోజులతో పోలిస్తే పెరిగిన రోజులలోనే ఎక్కువగా ఉన్నాయి.

ప్రతి పిల్లవాడి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండటం, అంతర్జాల సేవలు తక్కువ ధరకే లభించడం వంటివన్నీ ఎక్కువ రకాల సమాచారం ప్రతి మూలకు వెళ్లే అవకాశం కల్పించింది. ఇందులో అసభ్య వెబ్సైట్ లను చూసే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇంకా ఆందోళన కరం.. వీటిని చూసిన పిల్లల, పెద్దల ఆలోచనాతీరు ఎలా ఉంటుంది, దాని వల్ల వాళ్ళు చేసే పనులకు ఎలాంటి శిక్షలు ఉంటాయి అన్న విషయం కూడా మర్చిపోయి ప్రవర్తించడం వారి భవిష్యత్తు పట్ల, వారి చేతిలో బలి అయ్యే వారి భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.

కఠిన చట్టాల పట్ల అవగాహనాలేమి, క్షణకాల తొందరపాటుతో బాద్యుల, బాధితుల జీవితాల నాశనం గురించి అవగాహన పెంపొందించడం అవసరం.
పిల్లల విషయంలో తల్లితండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం. పిల్లలకు, టీనేజ్ విద్యార్థినులకు బయట వారి ప్రవర్తనా తీరు పైన అప్రమత్తంగా ఉండే అవసరం గురించి చెప్పడం ముఖ్యం.
మగ పిల్లల తల్లితండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, బయట వారి ప్రవర్తన ఎలా ఉందొ అన్నది కూడా గమనించాల్సిన విషయం.

ఈ మధ్య కాలంలో హైద్రాబాద్ షీ టీమ్స్ పోకిరీలను అరెస్ట్ చేసినప్పుడు అందులో దాదాపు 75% పిల్లలు 18 ఏళ్ళలోపు వారే అవ్వడం చాలా ఆందోళన కలిగించే విషయం.

ఇక అక్కడక్కడా పరిణతి చెందిన వారి విషయంలో కూడా ఇలాంటి విపరీత ధోరణి కనిపించడం కూడా ఆందోళన కరమే.

సత్వర శిక్ష, నిజానిజాల నిగ్గు తేల్చే ప్రయత్నం వేగంగా జరగడం వీటికి కొంచం ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యాలి..
మొన్న జరిగిన కథువా ఘటన నుండి, నిన్న జరిగిన స్పందన ఘటనల వరకు న్యాయవిచారణ వేగంగా జరగడం ముఖ్యం.

ఇక ఈ సర్వే జరిగింది దాదాపు 6 అంశాల ఆధారంగా అని సర్వే చేసిన ఏజెన్సీ చెప్పుకుంది, అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ అది చెప్పుకొచ్చిన అంశాలు ఇవి

1. లైంగిక హింస
2. సంస్కృతీ సంప్రదాయాలు
3. మహిళల అక్రమ రవాణా
4. లైంగికేతర హింస
5. వివక్ష
6. ఆరోగ్య పరిరక్షణ

ఈ పైన పేర్కొన్న 6 అంశాలలో లైంగిక హింస ఈ మధ్య 10 సంవత్సరాల కాలంలో అటు పోయిన పది సంవత్సరాలతో పోలిస్తే కొద్దిగా పెరిగింది అనే చెప్పుకోవాలి. ఈ మధ్య వచ్చిన కొత్త చట్టాలతో ఇది అరికట్టగలిగే స్థితిలోనే న్యాయ వ్యవస్థ ఉంది అని అనుకుంటున్నాను. కానీ మిగిలిన 5 అంశాలతో పోలిస్తే మిగిలిన అన్ని దేశాల కన్నా మన దేశంలో వాటి ప్రాబల్యం తక్కువ.

మరి ఇన్ని విధాల అంశాలతో కూడిన దాన్ని కేవలం ఒకే ఒక్క అంశంతో ముడిపెట్టి దేశ జనాభాలో దాదాపు 0.00001% శాతం కూడా లేని 548 మంది అభిప్రాయంతో ఏకీభవించి దేశం మొత్తానికి ఈ నింద అంటించడం ఎంతవరకు సబబో సదరు సంస్థ చెప్పాలి.

దేశాన్నీ ప్రపంచ దేశాల మధ్య దోషిగా నిలబెట్టే ఇలాంటి కుయుక్తులను చట్టపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *